29, ఫిబ్రవరి 2016, సోమవారం

ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో "సుందర వనాలు"

  సుందర వనాలు ,పశ్చిమ బెంగాల్

                                                   యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఇది ఒకటి . ఈ అడవులు విస్తీర్ణం లో ప్రపంచం లోనే అతి పెద్దవి .   పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లో సుందర్ బన్స్ రిజర్వ్ ఫారెస్ట్ గా పిలువబడే ఈ గంగా నది డెల్టా ప్రాంతం  మడ అడవులతో కూడి ఉన్నది .ఇక్కడ"సుందరి " పేరు గల వృక్షాలు ఎక్కువగా ఉండటం చేత వీటికి సుందర్ బన్ (సుందర్ వనాలు ) అనే పేరు వచ్చింది . కేంద్ర ప్రభుత్వం 1984 సంవత్సరం లో సుందర్ బన్స్ ను జాతీయ పార్క్ గా ప్రకటించింది . ఇది పెద్దపులకు అభయారణ్యమే కాక (biosphere  reserve forest )  జీవావరణ పరిరక్షణ కేంద్రం కుడా . భౌగోళికంగా సుందర్ బన్ అరణ్యాలు గంగ నది బంగాళ ఖాతంసంగమ ప్రాంతం లో ఆ నది పాయలతో కూడిన ద్వీప సముదాయం,మనదేశం లోను, బంగ్లాదేశ్ లోను విస్తరించి ఉన్నాయి.మనదేశం పరిదిలో (షుమారు 4300 చదరపు  కిలోమీటర్లు )104 దీవులున్నాయి.
                                             ఈ సుందర బన్స్ నేషనల్ పార్క్ ను  సందర్శించాలి అంటే ఈ ద్వీప సముదాయాల్లో లాంచ్ /స్టిమర్ల పై మాత్రమే ప్రయాణం  చేయవలసి ఉంటుంది.  4-5 ( gateways ) రేవుల(ముఖ ద్వారాల) ద్వారా సుందర్ బన్స్ లో నికి వెళ్ళాల్సి ఉంటుంది . Namkhana , Raidighi Canning , Sonakhali , Sajnekhali ఇవి ప్రధానమైన   gateways. ఇందులో Kolkata నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న gateway  Canning   ప్రముఖమైనది. kolkata  నగరంలో చాలా  ట్రావెలింగ్  ఏజెన్సీలు సుందర్  బన్స్ కు  2-3 రోజుల package tour లను నిర్వహిస్తుం టాయి. సాధారణంగాబృందాలు గా వచ్చే సందర్శకులంతా ఈ package tour లను ఆశ్ర యిస్తుంటారు  సందర్శకులు ఈ యాత్రకు అటవీ శాఖ అనుమతి పొందాల్సి ఉంటుంది . అందుకు సందర్శకులు ఫోటో కార్డ్ (ఆదార్ /PAN /voter ID/passport  etc) తప్పని సరిగా కలిగి ఉండాలి .

  ఈ యాత్ర లో కొన్ని ముఖ్యమైన దీవుల్లో  (Pakhirala, Sajnekhali , Dobanki , మొదలైనవి) గల  ఆహ్లాదకర మైన రిసార్ట్ లు , రెస్ట్ హౌస్ లు  ఫారెస్ట్ క్యాంపు లు ఉంటాయి . రాత్రి వేళల్లో బస చేయు సౌకర్యాలుంటాయి ఇది(Biosphere) జీవావరణ సంరక్షణ పార్క్ కుడా .ఇది  మన జాతీయ జంతువు Royal Bengal Tiger గా పిలువబడే పెద్దపులి    సంరక్షణ కేంద్రం .  కాని  ఇది  సందర్శకులకు అరుదుగా కనిపిస్తుంది . లేళ్ళు , fishing Cats , చిరుతలు , కోతులు , అడవి పందులు , ఇండియన్ గ్రే మంగూస్ ( ముంగిసలు ) నక్కలు  మొదలైనవి  కనిపిస్తాయి . వివిధ రకాల పక్షి జాతులు, నది పాయల్లో రకాల చేపలు మొసళ్ళు విష పూరితమైన   పాములు   కనిపిస్తుంటాయి . ఉప్పు నీటి సాంద్రతను తట్టుకునే వృక్ష  జాతులు  పుష్పించే  మొక్కలు ఇక్కడ దర్శన మిస్తాయి .


                 సుందర్ బన్స్ కు వెళ్ళటానికి  ముఖ్యమైన ఎంట్రెన్స్  కానింగ్ కు రైలు మార్గం ఉన్నది , ప్రైవేటు ,ప్రభుత్వ బస్సు సర్వీసులు  చక్కగా ఉన్నాయి. .kolkata లోని నేతాజీ సుబాష్ చంద్ర బోస్ విమానాశ్రయం (డమ్ డమ్) కి 65 కిలోమీటర్ల దూరం లో ఉన్నది . 

               సుందర్ బన్స్ అనేక దీవుల్లో వాచ్ టవర్లు ఉంటాయి . బంగాళా ఖాతనానికి  దగ్గరలో ఉన్న Bonnie camp దీవి  లో  50 అడుగుల అతి ఎత్తైన వాచ్ టవర్ ఉన్నది . ఈ దీవుల్లో ఎక్కడ ATM  లేవు  money విషయం ముందు ప్రణాళిక అవసరం . 



27, ఫిబ్రవరి 2016, శనివారం

భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం -అరుణ గిరి - అరుణాచలేశ్వరస్వామి ఆలయం

అరుణాచలేశ్వరస్వామి ఆలయం - తిరువణ్ణామలై 


                                    తమిళనాడు రాష్ట్రం లో చెన్నై నగరానికి 200 కిలోమీటర్ల దూరంలో తిరువణ్ణామలై లో (ఇది జిల్లా కేంద్రంకూడా) అరుణాచలేశ్వర  స్వామివారి  ఆలయం  ఉన్నది .  తమిళ పదం తిరు అనగా శ్రీ అనే గౌరవ  పదం  ఇక్కడ  ఉన్న గిరి  పర్వతం  పేరు  అన్నామలై  ఈ  రెండు  పదాలను  కలిపి  ఈ  క్షేత్రం  పేరు  తిరువణ్ణామలై  గా  స్థిర  పడింది  ఇక్కడ శివుడు  పంచ భూత లింగాములలో  ఒకటైన అగ్ని లింగ రూపంలో ప్రతిష్టితమై ఉన్నాడు .



                                            మిగిలిన లింగ రూపాలకు ఇక్కడ ఆలయాలున్నయి.  అవి జంబుకేశ్వర జలలింగం ,శ్రీ కాళ హస్తీశ్వర  వాయులింగం , కాంచీపురం లోని పృథ్వి లింగం  చిదంబరం లోని ఆకాశ లింగం . పురాణాల కధనం ప్రకారం బ్రహ్మ విష్ణు సంవాద సమయంలో పరమ శివుడు వారికి జ్యోతిర్లింగ స్వరూపం దర్శన మివ్వటం ,ఆ తేజో స్వరూపం (అగ్ని)గిరి ఆకారం దాల్చిన (Annal అనగా శివుడు) "అన్నామలై " పర్వతం గా భావిస్తారు .ఈ పర్వతం ఎరుపు వర్ణం లో ఉంటుంది కాబట్టి సంస్కృతం లో అరుణా చలం  లేదా అరుణ గిరి అని పిలుస్తారు .  కాబట్టి ఆ గిరి ప్రదక్షిణ కావిస్తే  పరమ శివుడికి ప్రదక్షిణ  చేసినట్లేనని యాత్రికుల విశ్వాసం . 

                                           గిరి ప్రదక్షిణ  14 కిలోమీటర్ల సాగుతుంది . మార్గమద్యంలో జగత్ ప్రసిద్దులైన భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆశ్రమం (ఆలయంనుండి 2 కిలోమీటర్ల దూరంలో) , అష్ట లింగాలు , అనేక తీర్థాలు ఇతర దేవాలయాలు కనిపిస్తాయి.  
                                                కాట్పాడి -విల్లుపురం సెక్షన్ రైల్వే మార్గంలో కాట్పాడికి  షుమారు 100 కిలోమీటర్ల దూరంలో తిరువణ్ణామలై (TNM )  రైల్వే స్టేషన్ ఉన్నది . తమిళ నాడు రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలనుండి బస్సు ప్రయాణ సౌకర్యం ఉన్నది .తిరువణ్ణా మలై కు దగ్గరలో  చెన్నైవిమానాశ్రయం ఉన్నది .  

The Temple City of India ,Bhubaneswar

దేవాలయాల రాజధాని -భువనేశ్వర్ 

                              ఒడిష రాజధాని నగరం  భుబనేశ్వర్ ప్రాచీన శతాబ్దాల్లో మరొక పేరు "త్రి భుబనేశ్వర్ " తో ప్రసిద్ది చెందినది . ఈ నగరం లో ఒకప్పుడు 2000 దేవాలయాలు  ఉండేవని  పురాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రస్తుతం  షుమారు  600  దేవాలయాలున్నాయి . 1946 లో ఈ నగర అభివృద్దికి జర్మన్ ఇంజినీర్  Otto Konigsberger  పధక రూపకల్పన చేశాడు, ప్రసిద్ది చెందిన ఆలయాలన్నీ పాత నగరంలోనే ఉన్నాయి .
కొన్ని ముఖ్యమైన దర్శనీయ ప్రదేశాలు
1.లింగ రాజ దేవాలయం :-
లింగరాజ దేవాలయం 
భుబనేశ్వర్ నగరం ఉన్న దేవాలయాలలో కెల్ల అతి పెద్దది. 1000ఏళ్ళకు పైబడిన చరిత్ర కలిగినది   కాళింగ వాస్తు శిల్ప కళ అలరారుతుంది . ప్రధాన గోపురం ఎత్తు 180 అడుగులు ఇక్కడ శివుణ్ణి  లింగరాజ్ గాను ,త్రిభుబనేశ్వరుడు పిలుస్తారు . త్రిభుబనేశ్వరుడు  అంటే  మూడు లోకాలకు నాయకుడు అని అర్ధం . ఈయన పేరుపైనే నగరానికి భుబనేశ్వర్ అనే పేరువచ్చింది . ఈ ఆలయ ప్రాంగణంలో  లెక్కలేనన్ని ఉపాలయాలు  ఉన్నాయి. ఈ ఆలయం భుబనేశ్వర్ airport కు 4-5 కిలోమీటర్ల దూరంలోను ,ప్రధాన రైల్వే స్టేషన్ కుడా 4-5 కిలోమీటర్ల దూరంలోనే  ఉన్నది
2.ముక్తేశ్వర ఆలయం:-
ముక్తేశ్వర ఆలయం
ఒకే ప్రాంగణం ఉన్న ముక్తేశ్వర ఆలయం, పరశురామ మందిరం1000 ఏళ్ళ క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో శంకరుడు ప్రధాన దైవం ఇక్కడ చిన్న బావి ఉన్నది.దీనిని"మరిచికుండం"అనిపిలుస్తారు ఇక్కడ   స్నానమాచరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని స్థానికుల  నమ్మకం.

పరశు రామేశ్వర మందిర్ 
3.పరశు రామేశ్వర మందిర్ :-  1500 ఏళ్ళ క్రితం నిర్మించన ఆలయం  ఈ ఆలయాల సుముదాయం లింగరాజ ఆలయానికి అతి సమీపం లోనే ఉన్నది. ఇక్కడ ఆలయం లో  శివుడు లింగ రూపం లోను , విష్ణువు శాలిగ్రామ రూపం దర్శన మివ్వటం చేత దీనిని పరశు రామేశ్వర మందిరమంటారు .
కేదార గౌరీ ఆలయం 








4.కేదార గౌరీ ఆలయం:- స్థానికంగా ఈ దేవా లయంను కేదారేశ్వర మందిరంగా పిలుస్తారు. Shital Sasthi festivalగా పిలువబడే శివపార్వతుల కళ్యాణం ప్రతిసంవత్సరం అత్యంత వైభవంగాఇక్కడ నిర్వహిస్తారు










5.రాజరాణి మందిర్:- ఇది 11వ శతాబ్దంలో నిర్మించబడినది . లేత ఎరుపు -పసుపు రంగు రాతిచేత నిర్మించటం చేత దీనికి రాజ రాణి మందిర్ అనే పేరు వచ్చింది (ఆ రకం స్టోన్ ను "రాజా రాణి స్టోన్ " అని పిలుస్తారు). గర్భాలయం ఎటువంటి దైవ ప్రతిమ లేదు , అయినప్ప టికీ దీనిని శైవ క్షేత్రం గా పరిగణింప బడుతుంది ,
రాజా రాణి మందిర్ 
 ఆలయ కుడ్యాలపై స్త్రీ పురుష మైధున దృశ్యాలు కూడా చెక్కబడి ఉండటం చేత స్థానికం గా దీనిని లవ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఆలయం చుట్టూ చక్కని గార్డెన్ ఉన్నది .కేదార్ గౌరి ఆలయం కి   దగ్గరలోనే ఉన్నది . సిద్దే శ్వర ఆలయం   Vaital Duel Temple, దులదేవి టెంపుల్  మొదలైనవన్నీ సమీపం లోనే ఉన్నవి .మొత్తం పై ఆలయాలన్నీ బిందు సాగర్ సరస్సు  పరిసరాల్లోనే ఉన్నాయి .
6.ఉదయగిరి & కందగిరి గుహలు :-ఈ గుహాలు పాక్షికంగా సహజసిద్దమైనవి .  లింగ రాజ ఆలయానికి 9 కిలోమీటర్ల దూరం లోను , ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు 7 కిలోమీటర్ల దూరం లోనున్నాయి . 
7.నందన్ కానన్ జూలాజికల్ పార్క్:- సుందరమైన కంజియా సరస్సు తీరం లోను, గరాజ దేవాలయానికి 20 కిలోమీటర్ల దూరం లొఉన్నది.  దగ్గరలోనే బారంగ్ అనే చిన్నపాటి రైల్వే స్టేషన్ ఉన్నది . నందన్ కానన్ బొటానికల్ గార్డెన్ కూడా ఇక్కడ ఉన్నది .                                   

8.ఒడిష స్టేట్ మ్యూజియం :- రాష్ట్ర మ్యుజియం  లింగరాజ దేవళానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది . పూరి  జగన్నాధ  దేవాలయం , కోణార్క  సూర్య  దేవాలయం రెండూ షుమారు 65 కిలోమీటర్ల దూరం లో ఉన్నవి . భుబనేశ్వర్ 16 వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్నది . చెన్నై -కోల్ కట (హౌరా ) రైలుమార్గం లో ఉన్నది .  

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

శ్రీ కృష్ణ భగవానుని కార్యక్షేత్రం -ద్వారక

ద్వారక - బేట్ ద్వారక,గుజరాత్
దగ్గర లోనే జ్యోతిర్లింగ క్షేత్రం

                             ఆధ్యాత్మికం గా చార్ దామ్ పుణ్య క్షేత్రాలు గా 4 దర్శ నీయ ఆలయాల్లో ద్వారక  ఒకటి . మిగిలిన మూడు  బదరీనాథ్ , పూరి  జగన్నాథ్ క్షేత్రం , తమిళనాడు లోని  రామేశ్వరం .ఇక ద్వారక విషయానికి వస్తే  ద్వారక -బేట్ ద్వారక  అనే రెండు క్షేత్రాల ప్రస్తావన వస్తుంది . ఈ రెండు క్షేత్రాల దర్శనం పూర్తి కావిస్తే కాని  ద్వారక యాత్ర పూర్తి అయినట్లు కాదు . ఈ రెండు ద్వారకల మద్య షుమారు 40 కిలోమీటర్ల  ఎడం ఉంటుంది .

ద్వారక క్షేత్రం 
                               ఇందులో మొదటిదైనద్వారకా క్షేతంగుజరాత్సౌరాష్ట్ర ద్వీపకల్పం లో గోమతీ నది సాగర సంగమ(అరేబియా సముద్రం ) ప్రాంతం లో ఉన్నది .  శ్రీ కృష్ణుని అవతార పరి సమాప్తి అయినతరువాత ద్వారక సముద్ర గర్భం లో కలసిపోయినదని మహాభారతం వల్ల తెలుస్తుంది . కృష్ణుని మనుమడైన వజ్రనాభుని చేత ప్రస్తుతం ద్వారకలో ఉన్న ఆలయం నిర్మించబడినదని పురాణాలు తెలియచేస్తున్నాయి. దీనిని 16 శతాబ్దం లో పునః నిర్మించారని ఇక్కడి శాసనాలు తెలియచేస్తున్నాయి . ఈ ఆలయ ప్రాంగణం లో  వాసుదేవ , దేవకీ ,బలరామ ,రుక్మిణి ,జాంబవతి ,సత్యభామ లకు ఆలయాలున్నాయి .

బేట్ ద్వారక క్షేత్రం 
                                    ద్వారక మీదుగా వచ్చే రైలు మార్గం ఓఖా తీరం లో ఆగిపోతుంది  ఇక్కడనుండి  3-4 కిలోమీటర్లు మర పడవ /స్టీమర్ పై  స్వంత జాగ్రత్తలతో సముద్ర  ప్రయాణం చేయటం ద్వారా బెట్ ద్వారక దీవి కి చేరుకోవచ్చు .ఇది శ్రీ కృష్ణుడు తన చిన్ననాటి మిత్రుడు  కుచేలుడు (సుదాముడు )ఇద్దరూ  కలుసుకున్న ప్రదేశం.
  
రుక్మిణి దేవి ఆలయం 
                ద్వారక -బెట్ ద్వారక లలో ఉన్న ఆలయాలు  కాక 18 కిలోమీటర్ల దూరంలోసముద్ర తీరానికి దూరంగా  దారుకావనం లో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో 6 వది  అయిన  నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉన్నది,  బేట్ ద్వారక మార్గానికి దూరంగా   కుడివైపున 2 కిలో మీటర్ల దూరం లో రుక్మిణి దేవి ఆలయం ఉన్నది , సముద్ర తీరం వెంబడి 235 కిలో మీటర్ల దూరం లో మరొక జ్యోతిర్లింగా క్షేత్రం సోమనాథ్ ఉన్నది .

                 గుజరాత్ లో ప్రముఖ నగరమైన జామ్ నగర్ 135 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . జునాగడ్ (200 KM ) సోమ నాథ్  జ్యోతిర్లింగం 235 కిలోమీటర్ల దూరం లో ఉన్నది . అహ్మదా బాద్  నుండి  ద్వారక మీదుగా ఓఖా వరకు రైలు మార్గ మున్నది . ద్వారక కు దగ్గరలో ఉన్న విమానాశ్రయం జామ్ నగర్ లో ఉన్నది . 

22, ఫిబ్రవరి 2016, సోమవారం

(ॐ)కారేశ్వర జ్యోతిర్లింగం,మద్య ప్రదేశ్,

ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వరం

                                  ఈ క్షేత్రం మద్య ప్రదేశ్, మాళవ ప్రాంతం  ,ఖండ్వా జిల్లాలో జిల్లా కేంద్రం ఖండ్వా  కు  70 కిలోమీటర్ల  దూరం లో ఉన్నది . ఓం కార  ఆకారం లో ఉన్న ఈ క్షేత్రం ఇండోర్ కు 78కిలో మీటర్ల  దూరం లో నర్మదా నది లో ఉన్న మాంధాత అనే దీవిలో ఉన్నది. ఈ దీవి విహంగ వీక్షణం లో  ఓం(ॐ) అనే హిందీ అక్షర ఆకారం లో కనిపించటం చేత ఇక్కడ మహే శ్వణ్ణి ఓం కారేశ్వరుడని పిలుస్తారు. ఆ విధంగా ఈ క్షేత్రం ఓం కారేశ్వర క్షేత్రం అయినది .

ఓం కారేశ్వరుడు 
                                     ఇక్కడమరొక క్షేత్రం mainland లోనర్మద నదీతీరం లోనే ఉన్నది . ఈ క్షేత్రం శివుడు మమలేశ్వర్  ( అమలేశ్వరుడు), లేదామమ్ రేశ్వర్ (అమరేశ్వరుడు)ఈ రెండు జ్యోతిర్లింగాలే ఈ కారణం చేత ఈ రెండు ఆలయాల దర్శనం అయితేనే జ్యోతిర్లింగ దర్శనం పూర్తి అవుతుంది. 
అమలేశ్వరుదు 

                  ఓంకారేశ్వర ఆలయానికి దిగువన  ఆది శంకరాచార్యుల వారికి గురుత్వం వహించినగురు గోవింద భగవత్పాద నివసించిన గుహ ఉన్నది . 
గోవింద భాగవత్పాదుని గుహ 
                                                 మాంధాత  దీవి లో   గిరి ప్రదక్షిణ(ఓం కారే శ్వర్ పరిక్రమ )చేయగలిగితే  (6-7 కిలోమీటర్లు)కొన్ని ఆలయాలను, మఠాలను చూడవచ్చు ,అందులో ఒకటి 1000 ఏళ్ళ చరిత్ర కలిగిన సిద్దనాథ్ మహాదేవ్ ఆలయం ఒకటి, ఓం కారే శ్వర్ నుండి  ఇండోర్ కు  వెళ్ళే మార్గం లో  బైగ్రమ్ గ్రామంలో  దేశం లో పెద్దవైన శని దేవాలయాల్లో ఒకటి ఉన్నది .
సిద్ నాథ్ మహాదేవ ఆలయం శిథిల  కట్టడాలు 
                                            దగ్గరలో ఉన్న విమానాశ్రయం  ఇండోర్  లో  ఉన్నది . Ratlom -khandwa  section లో ఓంకారేశ్వర రోడ్ (OM )  పేరుతో  చిన్నపాటి  స్టేషన్ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . కానీ  ఇండోర్, ఖండ్వా ( Major  రైల్వే స్టేషన్  లు ) మాత్రమే ప్రధానమైనవి ,ఇక్కడకు  1-2 గంటల బస్సు ప్రయాణ దూరం మాత్రమే.    


19, ఫిబ్రవరి 2016, శుక్రవారం

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం-విక్రమాదిత్యుని ఉజ్జయిని ఇదే

మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఉజ్జయిని

మహాకాళి ఆలయం(అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి)

                                         తెలుగు నాట చిన్నతనం లో చాలామంది విన్న విక్రమాదిత్యుని కథ లోని ఉజ్జయిని ఇదే. ఈక్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్ర   రాజధాని నగరం అయిన  భోపాల్ కు పశ్చిమాన 200 కిలోమీటర్లదూరంలో ఉన్నది.మధ్యప్రదేశ్ లోని మరో ప్రముఖనగరం ఇండోర్ ఇక్కడకు 60 కిలోమీటర్లదూరంలో ఉన్నది. దీనిని పూర్వకాలంలో అవంతిక అనే పేరుతొ కూడా పిలిచేవారు. ఈమహాకాళేశ్వరరుని ఆలయ సముదాయం క్షిప్రా(kshipra)నది తూర్పు తీరం లో ఉన్నది. మహా దేవుని తో పాటు ఇతర దేవతా మూర్తుల ఆలయాలున్నాయి . ప్రధాన ఆలయం మూడు అంతస్తుల్లో ఉంటుంది . భూమట్టానికి దిగువన మొదటి అంతస్తు (gound floor) మహాకాళేశ్వరుడు, భూమిపై మద్యఅంతస్తులో ఓంకారేశ్వరుడు పై అంతస్తులో నాగ చంద్రేశ్వరుడు   కొలువై ఉంటారు .

మహా కాళేశ్వరుడు 
                                 
                పూర్వం మహా కాళే శ్వరునికి  శ్మశానం నుండి అప్పుడే తెచ్చిన చితాభస్మంతో  ప్రాతః కాలవేళ పూజ నిర్వహించేవారు . ఇప్పుడు ఆవుపేడను కాల్చగా వచ్చిన భస్మం (విభూది ) పూజ నిర్వహిస్తున్నారు . దీనిని భస్మ హారతి అని పిలుస్తుంటారు .ఈ భస్మ హారతి ని చూడటానికి స్త్రీలకు  అనుమతి లేదు .  ఆలయ సముదాయం లో ఉన్న ఇతర ఉపాలయాలలో  స్వప్నేశ్వర మహాదేవ(దుస్వప్నాల నివృత్తికి),చంద్రాదిత్యేశ్వర మహాదేవ,ఆదికాళేశ్వర మహాదేవ, వృద్దకాళేశ్వరమహాదేవ లింగాలు ముఖ్యమైనవి . ఉజ్జయినీ కి రాజు /నాయకుడు  మహాదేవుడని ఇక్కడ మరే ఇతర రాజు /నాయకుడు  రాత్రి బస చేయరాదని , లేనట్లయితే వాళ్ళు తమ పదవులను కోల్పోతారని  ఇక్కడ స్థానికులు చెబుతారు .


              అష్టా దశ శక్తిపీఠాల్లో ఒకటైన మహకాళి ఆలయం ఇక్కడ ఉన్నది . స్థానికంగా హర సిద్ధి మాతా ఆలయంగా మాత్రమే ప్రసిద్దమైనది. (మహకాళీ అంటే ఇక్కడ ఎవ్వరికితెలియదు) మహాకాళేశ్వర ఆలయానికి అతి సమీపం లోనే ఉన్నది . 
   
హరసిద్ది మాత ఆలయం 

                             ఉజ్జయిని ఇంకా సాందీపుని ఆశ్రమం ,భతృహరి గుహలు ,ఇస్కాన్ టెంపుల్,కాలభైరవ ఆలయం కాళి దాస్ ప్యాలస్   మొదలైన ప్రదేశాలున్నాయి .
                           ఉజ్జయిని కి దేశం లోని అన్ని ప్రాంతాలనుండి, (మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోను) బస్సు /  రైలు ప్రయాణ సౌకర్యం ఉన్నది . ఇండోర్  దీనికి అతి సమీపం లో ఉన్న విమానశ్రయం    
                                                                                                                                                               

18, ఫిబ్రవరి 2016, గురువారం

సోమనాథ్ ఆలయం,సౌరాష్ట్ర,గుజరాత్

సోమనాథ్ ఆలయం,సౌరాష్ట్ర,గుజరాత్ 

జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొదటిది

                                       శివపురాణం లో పేర్కొన జ్యోతిర్లింగాల మొదటిది సోమనాథ్ క్షేత్రం , దేశ వాయువ్య ప్రాంతం లో ఉండటం చేత పలుమార్లు విదేశియుల దండయాత్రల పాలై విద్వంసాలకు దోపిడీలకు నేలవైనది . అదేవిదంగా పునఃనిర్మితమైంది .దక్ష ప్రజాపతి ఇచ్చిన శాప విముకై చంద్రుడు స్నానమాచరించిన ప్రభాస తీర్థం ఇక్కడ ఉన్నది . ఇక్కడ లింగాన్ని చంద్రుడు  ప్రతిష్టించటం చేత ఇక్కడ శివుడు సోమనాథుడు పేరుతొ పిలువబడుతున్నాడు .  


                                         
                        గుజరాత్ రాష్ట్రం సౌరాష్ట్ర ప్రాంతం లో గిర్ సోమనాథ్ జిల్లా లో అరేబియా సముద్ర తీరంనికి చేరి ఉన్నది . అహ్మదాబాద్ నగరానికి షుమారు 400 కిలోమీటర్ల దూరం లో ఉన్నది .సౌరాష్ట్ర ప్రాంతానికి మూడు దిక్కులా సముద్రమున్నది. దేశమంతటి నుండి railway connectivity ఉన్న ఆహ్మాదాబాద్  జంక్షన్  నుండి ఇక్కడకు రైలు మార్గమున్నది .  దగ్గరగా ఉన్న విమానాశ్రయం Keshod 52 కిలోమీటర్ల దూరం లో ఉంది .

                                  శ్రీ కృష్ణుడు నిర్యాణము చెందిన  భల్క తీర్థం  సోమనాథ దేవాలయం కు దగ్గరలోనే ఉన్నది. హిరణ్య, కపిల్, సరస్వతి నదుల సంగమం అయిన ప్రదేశం లో   త్రివేణిఘాట్  సముద్ర తీరానికి దగ్గరలోనే ఉన్నది.



17, ఫిబ్రవరి 2016, బుధవారం

సూర్యుని కిరణాలు సూర్య నారాయణుని పాదాలపై ...............

  శ్రీ సూర్యనారాయణ స్వామి  దేవాలయం -అరసవిల్లి                                              ఆంధ్ర ప్రదేశ్ ,శ్రీకాకుళం జిల్లా లో అరసవిల్లి (Arasavalli ) గ్రామం లో గల సూర్య నారాయణ స్వామి దేవాలయం  చాలా ప్రసిద్ది చెందినది . ఒకప్పుడు విడిగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు  జిల్లా కేంద్రం అయిన  శ్రీకాకుళం పట్టణంలో కలసిపోయింది. దేవేంద్రుడు స్వయంగా సూర్యనారాయణస్వామిని  ప్రతిష్టించాడని  ఇక్కడి స్థల పురాణం . 7 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ ఆలయం  ముస్లిం పాలకుల దాడుల్లో నాశనమై  మరల 18 శతాబ్దం లో పునఃనిర్మితమైనది. రధ సప్తమికి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి. ఇక్కడ మార్చి,అక్టోబర్( ఉత్తరాయణ ,దక్షిణాయన కాలాల్లో) నెలల్లో  ప్రభాతవేళ సూర్యుని కిరణాలు  ఆలయంలోని సూర్య నారాయణుని పాదాలపై పడటం ఇక్కడి ఆలయం ప్రత్యేకత .

                         
   


                                                                          శ్రీ కాకుళం 5 వ (New No.16)నెంబరు జాతీయ రహదారి పై ఉన్నప్పటికీ  శ్రీ కాకుళంరోడ్ పేరుతొ ఉన్న రైల్వే స్టేషన్  మాత్రం ఇక్కడికి 16 కిలో మీటర్ల దూరం లో(చెన్నై -హౌరా  రైల్వే మార్గం ) ఆముదాల వలస లో ఉన్నది . ఎయిర్ పోర్ట్ ఉన్న విశాఖపట్నం 120 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. శ్రీ కూర్మం ఇక్కడికి 12 కిలో మీటర్ల దూరం లో ఉన్న పుణ్య క్షేత్రం . ఇక్కడ మహా విష్టువు కూర్మావతారరూపంలో దర్సనమిస్తాడు.మరొక ప్రముఖ ఆలయం శ్రీముఖంలో ఉన్న శ్రీశ్రీవారాహిసమేత శ్రీముఖలింగేశ్వర ఆలయం 52 కిలోమీటర్ల దూరంలో ఉన్నది . 

ప్రపంచ వారసత్వసంపద లో ఒకటి కోణార్క సూర్య దేవాలయం

కోణార్క సూర్య దేవాలయం, ఒడిష 

            ప్రపంచ వారసత్వసంపద లో ఒకటిగా ఐక్య రాజ్య సమితి చేత గుర్తించబడిన  కోణార్క సూర్య దేవాలయం 13 శతాబ్దం లో నిర్మించ బడినది . సప్త వర్ణాల/ ఏడు రోజులకు  ప్రతిక గా 7గుఱ్ఱాలు పూన్చి 3 మీటర్ల ఎత్తుండే  24 చక్రాలు కలిగిన రధం ఆకారం లో ఈ దేవాలయం నిర్మించబడినది . ఆలయ సముదాయం లోని ప్రధాన మైన సూర్య దేవాలయం 229 అడుగుల ఎత్తు ఉంటుంది . గంగ వంశానికీ చెందిన పాలకుడు  నరసింహదేవుడు నిర్మించాడు.


                             వేద కాలం నుండి జనులు అగ్ని,వాయువు , వరుణుడు , తదాదిగా ప్రకృతి శక్తులను పూజించటం జరిగేది  ఆ క్రమం లోనే సూర్యుణ్ణి  అరాదించటం ఆలయం నిర్మించటం జరిగింది . ప్రధాన దేవాలయం లో పూజలు జరగ నప్పటికీ అనుబంద ఆలయాల్లో ఒకటైన నవగ్రహలయం నందు పూజలు జారుతుంటాయి . దేశ విదేశీ యాత్రికులను మంత్రముగ్దులను చేయటం  ఇచ్చటి శిల్పకళా సౌందర్యం శిల్పుల నైపుణ్యానికి చిహ్నం . నిర్మించిన  300 సంవత్సరాలకే  ఆలయం విద్వంసం అయినది . ఏ కారణాల వల్ల విద్వంసం అన్న విషయం పై చరిత్రకారులకు ఏకాభిప్రాయం లేదు .కోణార్క్ కూడా పూరి క్షేతం వలెనే అందమైన బీచ్ గల  సముద్ర తీరం లో ఉన్నది .


                             రాజధాని నగరం భుబనేశ్వర్ (భువనేశ్వర్ ) కు 65కిలోమీటర్ల దూరం లో ఉన్నది . 35 కిలో మీటర్ల దూరం లో సుప్రసిద్ద పుణ్య క్షేత్రం పూరి ఉన్నది . ఈ రెండు ప్రదేశాల వరకు దేశం లోని అన్ని ప్రాంతాల నుండి rail way connectivity ఉన్నది . భుబనేశ్వర్  లో Air Port ఉన్నది . 



16, ఫిబ్రవరి 2016, మంగళవారం

జోగులాంబ దేవాలయం - దేశం లో 5వ శక్తి పీఠం

 

 


  

                                                      ఆది శంకరా చార్యుల వారిచే  ప్రవచింప బడిన అష్టా దశ శక్తి  పీఠాల్లో అలంపురం లోని జోగుళాంబ అమ్మవారి  ఆలయం 5వది . ఇది తెలంగాణా రాష్ట్రం లో జిల్లా కేంద్రం మహబూబ్ నగర్ కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నపటికీ , 7 నెంబర్ జాతీయ రహదారికి (Hyderabad -Bangalore National High way ) 17కిలోమీటర్లదూరం  లోను ,ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రం   లోనున్న  కర్నూలు పట్టణానికి 25 కిలో మీటర్ల దూరంలోను ఉన్నది. ఈ ఆలయం 7శతాబ్దంలో బాదామి చాళుక్యులు లచేతనిర్మించబడి ,తరువాత కాకతీయులు ,విజయనగర పాలకులు చేత అబివృద్ది చేయ బడినది. ఇక్కడ జోగులాంబ అమ్మవారు రౌధ్ర స్వరూపిణి  9 బ్రహ్మేశ్వర ఆలయాలున్నాయి  ఇవన్ని శివాలయాలే . వీటిలో బాలబ్రహ్మేశ్వర ఆలయం ప్రధానమైనది .ఈ ఆలయాలు తుంగభద్ర  నదీ తీరం లోనే ఉన్నాయి .  తుంగబధ్ర డాం  నిర్మాణం వలన ముంపుకు గురి కావటం చేత మునిగి పోయిన సంఘమే శ్వర దేవాలయాన్ని అక్కడ నుంచి తరలించి అలంపురం లో పునః నిర్మించారు .  



                                       హైదరాబాద్ నగరానికి 215 కిలోమీటర్ల దూరం లో ఉన్నది . 7 నెంబరు జాతీయ రహదారి పై ఉండటం చేత హైదరాబాద్ , కర్నూలు నగరాల నుండి Bus /Taxi సౌకర్యాలున్నాయి . కాచి గూడ -గుత్తి రైలు మార్గం లో  అలంపూర్ కు  కర్నూలు రైల్వే స్టేషన్ 25 కిలోమీటర్ల దూరంలోను ,అలంపూర్ రోడ్  రైల్వే స్టేషన్ 9 కిలోమీటర్ల దూరం లోను ఉన్నాయి .

దగ్గరలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు:-

రేణుక ఎల్లమ్మ దేవాలయం :- అలంపురం కు 52 కిలోమీటర్ల దూరం లో వడ్డమాను గ్రామం నందు  కర్నూలు జిల్లా లో ఉన్నది  

15, ఫిబ్రవరి 2016, సోమవారం

పూరి జగన్నాధ పుణ్య క్షేత్రం

పూరిక్షేత్రం వైష్ణవ దివ్యదేశాల్లో (ఆలయాల్లో ) ఒకటి 

'పూరి' పేరొందిన వైష్ణవ పుణ్య  క్షేత్రం  


  దేశం లోని  ప్రముఖ దేవాలయాలలో పూరి ఒకటి .  ఈ భారి ఆలయ సముదాయం ఒడిషా (ఒరిస్సా )రాష్ట్రం లో బంగాళా ఖాతం సముద్ర తీరం ఉన్నది . పురి కి ఆధ్యాత్మికం గా పురుషోత్తమక్షేత్రం(మహావిష్ణువు కు పురుశోత్తముడనే పేరు ఉన్నది )   శ్రీ క్షేత్రం అనే పేర్లు కూడా ఉన్నాయి . ఆది శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ దామ్ క్షేత్రాలలో పూరి ఒకటి (మిగిలినవి బదరీనాథ్ ద్వారక రామేశ్వరం ). జగాలన్నిటికి  నాథుడైన విష్ణు మూర్తి జగన్నాదుడిగా ,సోదరుడు బలరాముడు (బలభద్రుడు),సోదరి సుభద్ర ఇక్కడ కొలువై ఉన్నారు .ఇక్కడి స్థల పురాణం ప్రకారందైవాజ్ఞ ప్రకారం వేపకొయ్య పై  సుభద్ర, బలబద్ర ,జగన్నాధుల విగ్రహాల తయారి సమయం లో శిల్పి కి ఆటంకం కలుగటం చేత అవి అసంపూర్ణంగా ఉండిపోయాయని ,బ్రహ్మ దేవుడి ఆజ్ఞ ప్రకారం వాటిని యధాతదం గా ప్రతిష్టించారని చెబుతారు .  సనాతన ఆచారాలకు నిలయం ఈ పూరి క్షేత్రం ,ప్రాచీన సంప్రదాయాలను ఇంకా ఇక్కడ పాటిస్తున్నారు .  అన్య మతస్తులకు ఆలయ ప్రవేశం లేదు . నిత్యం దేశం నలుమూలల నుండి  వచ్చేయాత్రికుల  జగన్నాధుని నామస్మరణ తో పూరి దేవాలయం మారుమ్రోగుతూ ఉంటుంది .    

                           
            దేశం లో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్నఇక్కడి దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సం.రం. లకొక సారి మార్చి నూతన దేవతా మూర్తులు ప్రతిష్టిం చుతూ ఉంటారు .దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు . లక్షలాది మంది భక్తులు పాల్గొంటూ   జగన్నాధ రధ యాత్ర గా పిలువబడే ఘోషా యాత్ర   ప్రతి సంవత్సరం ఆషాడ శుధ్ధ విధియ రోజున ప్రారంభమై 3కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది  తరువాత సుభద్ర ,బలబద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు పూరీ ఆలయానికి చేరటం(బహుదా యాత్ర ) తో ముగుస్తుంది. ఇది 12 రోజులు పాటు జరిగే ఉత్సవం .  జగన్నాధుని రధం పేరు నందిఘోష(16చక్రాలు)  ,బలభద్రుని రధం పేరు తాళ ద్వజం(14 చక్రాలు) సుబద్ర రధం దర్పదళని  (12 చక్రాలు) వీటిని ప్రతిసంవత్సరం నూతనంగా తయారుచేస్తారు . ఈ రధ యాత్ర అంతర్జా తీయ ఉత్సవం ఇతర దేశాల్లోని హిందువులు ఈ ఉత్సవాన్ని ఆయచోట్ల నిర్వహిస్తారు .
గుండిచా ఆలయం 

                         దేశం లోని అందమైన బీచ్ లలో పూరి బీచ్ ఒకటి ఇది ఎల్లపుడు దేశ ,విదేశి పర్యాటకులతో కళకళ లాడుతూ ఉంటుంది . దేశం లోని అన్ని ప్రాంతాలనుండి ఇక్కడకు రైలు ప్రయాణ సౌకర్యం ఉన్నది (చెన్నై -హౌరా రైలు మార్గానికి కుర్దా రోడ్ junction కు  పూరి రైలు మార్గం కలపబడి ఉంటుంది .) మన రాష్ట్రము లోని విశాఖపట్నం కు 450 కిలోమీటర్ల దూరంలో ఉంది . విమాన ప్రయాణానికి  58 కిలో మీటర్ల దూరంలో రాష్ట రాజధాని భువనేశ్వర్ లో ఎయిర్ పోర్ట్ ఉన్నది

                             సముద్ర తీరం వెంబడి 36 కిలోమీటర్ల దూరంలో ప్రసిద్ద సూర్య దేవాలయం కోణార్క్ ఉన్నది.  దేశం లోనే అతి పెద్ద ఉప్పునీటి సరస్సు పూరి కి 50 కిలోమీటర్ల దూరం  లోనే ఉన్నది .


13, ఫిబ్రవరి 2016, శనివారం

నవ నందుల్లో మహానంది

 మహానంది 

 

మహానంది యాత్ర లో ఉన్న నందులు 9 అవి 1.  ప్రధమ నంది 2. నాగనంది 3. వినాయక నంది  4. గరుడనంది  5. ఉగ్ర నంది  6. మహానంది  7. సూర్య నంది  8 విష్ణు నంది  9 సోమ నంది .  కర్నూలు జిల్లా లోనంద్యాల కు 18 కిలోమీటర్ల దూరంలో నవనందులలో ఒకటైన మహానంది క్షేత్రమున్నది .ఇది  ఒక మండల కేంద్రం కూడా . మిగిలిన 8 నంది క్షేత్రాలు ఈ మహానంది కి దగ్గరలోను , నంద్యాల పట్టణ పరిధి లోనే ఉన్నాయి . నల్లమల అడవులలో  పర్వత పంక్తుల నడుమ 7 శతాబ్దం లో  బాదామి చాళక్యు లచే నిర్మింప బడిన  ఈ మహానంది క్షేత్రము లో పరమ శివుడు  మహానందీశ్వరుడు గా, పార్వతి దేవి కామేశ్వరి దేవి గా పూజింప బడుచున్నారు . ఆలయ ప్రాంగణం లో పుష్కరిణి ఉన్నది . దీనిని రుద్రగుండం అని పిలుస్తారు .ఇదే ఆలయ ప్రాంగణం ఆంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. ఈ స్వామికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి . ఇక్కడ  పాండవులు ప్రతిష్టించిన లింగాలున్నాయి .

ఆలయానికి సమీపం లో ఉన్న నంది విగ్రహం

 మహానంది కి చేరుకునే మార్గాలు :-

గుంతకల్ -విజయవాడ రైలు మార్గంలో ఉన్న నంద్యాల 18 కిలోమీటర్ల దూరం లోను  మరో చిన్న Halt గాజులపల్లి 12కిలోమీటర్ల దూరం లోను ఉన్నది . నంద్యాల నుండి బస్సు /Auto  సౌకర్యాలున్నాయి .

మహానంది కి దగ్గరలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు :-

యాగంటి :-ప్రముఖ శైవ క్షేత్రం , వయా గాజుల పల్లి 68 కిలోమీటర్ల దూరంలో
అహోబిలం :- ప్రముఖ నరసింహ క్షేత్రం ,వయా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .

12, ఫిబ్రవరి 2016, శుక్రవారం

శ్రీ కాళహస్తి ప్రముఖ శైవ క్షేత్రము -వాయు లింగ క్షేత్రము

శ్రీ కాళహస్తి ప్రముఖ శైవ క్షేత్రము -వాయు లింగ క్షేత్రము



 శ్రీ కాళహస్తి పంచఋుుత   లింగాములలో ఒకటైన వాయు లింగమున్న  క్షేత్రము . శ్రీ కాళహస్తి  చిత్తూరు జిల్లా లో స్వర్ణ ముఖీ నదీ తీరం ఉన్నది. బారత దేశం లో ఉన్న అతి పెద్ద దేవాలయములలో ఇది ఒకటి . శ్రీ కాళహస్తి నామానికి సంబందించి  (శ్రీ అనగా సాలేపురుగు ,కాళ (ము )=సర్పము ,హస్తి =ఏనుగు , తిన్నడు  /కన్నప్ప ) కధలు ప్రాచుర్యం లో ఉన్నాయి . ఇక్క పార్వతీ దేవి జ్ఞాన ప్రసూనాంభ గా కొలువై యున్నది . పల్లవులు ,చోళులు , విజయనగర చక్రవర్తులు  ఈ ఆలయాన్ని విశేషం గా అబివృద్ధి చేసారు .  ఆలయ ప్రాంగణం లో భూమి లోపల పాతాళ గణపతి ఆలయం ఉన్నది. శివుడు వసిష్ట మహర్షి కి ఇక్కడ పంచముఖ నాగలింగేశ్వరుడు గా దర్శనం ఇవ్వడం చేత సర్ప దోష నివారణ పూజలు , ఇక్కడ శివుడు నవగ్రహాలను కవచంగా ధరించడం చేత రాహు కేతు గ్రహ దోషశాంతి పూజలు  ఇక్కడ జరుగుతాయి. మార్కండేయుడు మొదలైన పురాణ పురుషులు ప్రతిష్టిం చిన శివలింగాలు ఇక్కడ మండపాలలో దర్శనమిస్తాయి. ఆలయం లో మూకబిలం/పాతాళ గంగ   ఉన్నది అక్కడ ఉన్న నీటి ని  సేవిస్తే నత్తి పోతుందని ఇక్కడివారివిశ్వాసం. ఆలయానికి చేరి ఉన్న కొండపై కన్నప్ప గుడి ఉన్నది. మహాశివరాత్రి సమయంలో 12రోజులు పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.  శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించిన గాలిగోపురం  2010 సం ., లో కులిపోగా కొత్తగా మళ్ళి నిర్మించారు .


శ్రీకాళహస్తి  పరిచయం అక్కరలేని తిరుపతి పట్టణానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉన్నది ,రేణిగుంట -గూడూరు రైల్వే మార్గంలో  శ్రీ కాళహస్తి  స్టేషన్ ఉన్నది.దేశం లోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడకు తిరుపతి వరకు /తిరుపతి మీదుగా ప్రయాణ సౌకర్యాలున్నాయి  శ్రీ కాళహస్తికి దగ్గరలో ఉన్న అనేక దర్శ నీయ ప్రదేశ లలో మరో శైవ క్షేత్రం సదాశివ కోన 52 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట -తిరుత్తుణి మార్గంలో ఉన్నది. 8కిలో మీటర్ల దూరంలో తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ప్రాచీన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది . 

11, ఫిబ్రవరి 2016, గురువారం

పంచారామ క్షేత్రాలు

     అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి (ద్రాక్షరామ మాణిక్యాంబ దేవాలయం)

             

             పురాణ కాలం  లో పరమశివుని కుమారుడు కుమారస్వామి తారకాసురుణ్ణి సంహరించే క్రమంలో అతని కంఠాన్నిచేదించగా అందున్నశివుని ఆత్మ లింగం 5ముక్కలై భూమి పై పలు చోట్ల  పడగా పడిన చోట దేవతలు వాటిని అక్కడ ప్రతిష్టించారని అవి పంచారామాలుగా ప్రసిద్ది చెందాయని భక్తుల విశ్వాసం. ఇవి అన్ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనే మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కలిగి ,  తూర్పు గోదావరి జిల్లా లో రెండు, పశ్చిమ గోదావరి జిల్లా లో రెండు , గుంటూరు జిల్లా లో ఒకటి ఉన్నాయి అవి



1. దాక్షారామం (ద్రాక్షారామం) :- తూర్పుగోదావరి జిల్లా, ద్రాక్షారామంలో ఈ క్షేత్రం 10 శతాబ్ధ కాలంలో తూర్పు చాళుక్యపాలకుడైన  భీముడి చేత  నిర్మిచబడినట్లు తెలుస్తుంది ఇక్కడ భీమేశ్వరుడు, మాణిక్యాంబ అమ్మవారు (అష్టా దశ శక్తిపీఠాల్లో  ఈ ఆలయం ఒకటి) కొలువై ఉన్నారు.  పురాణ కాలంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన ప్రదేశం అందు చేత ఇది దాక్షారామం కాలక్రమేణా ద్రాక్షారామం అయినది. రాజమహేంద్రవరానికి (రాజమండ్రి)కి 43కిలో మీటర్ల దూరంలోను ద్వారపూడి-యానాం రోడ్ లో దాక్షారామం ఉన్నది(కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి (NH- 214) కు18 KM దూరం) దీనికి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ద్వారపూడి 25 కిలో మీటర్ల దూరంలో ఉంది .




 2. అమరారామం (అమరావతి) :- విజయవాడ కు 40 కిలో మీటర్ల దూరంలో గుంటూరు జిల్లా లో కృష్ణా నది తూర్పు తీరంలో ఉన్న అసలైన అమరావతి  గ్రామం ఇది .ఇది గుంటూరు పట్టణానికి 35 కిలో మీటర్ల దూరం లో  రాష్ట్ర నూతన రాజధాని "అమరావతి " గా పిలువబడుతున్న పలుగ్రామాలతో కూడిన ప్రాంతానికి ఇది దగ్గరగా ఉన్నది.  నూతన రాజధాని "అమరావతి " అబివృద్ది చర్యల దశ ఇది కూడా రాజధానిలో కలసి పోతుంది . ఇక్కడ కృష్ణా తీరంలో ఇంద్రుడు శివలింగ ప్రతిష్ట చేయటం చేయటం చేత ఇది అమరారామం అయింది. శివుడు అమరేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు .ఇక్కడ పార్వతి దేవి బాల ఛాముండేశ్వరి గా పూజింపబడుతుంది. శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించిన మండపం  ఆయన వేయించిన శాసనాలు ఆలయ ప్రాగణం ఉన్నాయి  ,అమరావతి లో పురావస్తు శాఖ వారి మ్యూజియం అమరావతి స్తూపంఉన్నాయి.    





3. క్షీరారామం (పాలకొల్లు ) :- పశ్చిమ గోదావరి జిల్లాలో NH 214 పై పాలకొల్లు ఉన్నది.  ఒకానొక సందర్బం లో శివుడు భూమిపై బాణాన్ని సంధించగా క్షీరం ఉద్బవించి కొలనుగా మారినదని, పాలకొలను  కాలక్రమేణ  పాలకొల్లు గా మారిందని ఇక్కడివారి విశ్వాసం. త్రేతా యుగంలో రాముడు ఇక్కడ ప్రతిష్టించిన శివలింగం క్షీరారామలింగేశ్వరుడు గాను తల్లి పార్వతి దేవి గాను  పూజింప బడుచున్నారు . 125 అడుగుల ఎత్తైన ఆలయ గోపురం  పాలకొల్లు గోపురం గా పరిసర ప్రాంతాలలో ప్రసిద్ది. విజయవాడ కు 140 కిలో మీటర్ల (via Gudivada -NH -9,NH 214) దూరం లో ఉన్నది. విజయవాడ- నరసాపురం రైలు మార్గం లో పాలకొల్లు ఒక ముఖ్య మైన స్టేషన్.   



4. సోమారామం (భీమవరం) :- పశ్చిమ గోదావరి జిల్లా లో భీమవరం పట్టణం లో ఈ సోమారామ క్షేత్రం ఉన్నది  చంద్రుడు ప్రతిష్ఠించటం చేత  శివుడు సోమేశ్వ రుడుగా,పార్వతీదేవి అన్నపూర్ణ గాను  పూజింప బడుచున్నారు. ఇది విజయవాడ నగరానికి 120 కిలో మీటర్ల దూరం లో పాలకొల్లు వెళ్ళ మార్గంలో (రైలు ,బస్సు ప్రయాణాలు రెండింటి లోను ) ఉన్నది. 





 5.  కుమారారామం  (సామర్లకోట) :- తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట లో ఉన్నదీ క్షేత్రం . ద్రాక్ష రామ క్షేత్రాన్ని నిర్మించిన వేంగి తూర్పు చాళుక్య రాజు భీముడే ఈ ఆలయాన్ని నిర్మించాడు శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్టించటం ఇక్కడ పరమేశ్వరు రుణ్ణి కుమార భీమేశ్వ రుడు గా పుజిస్తారు, పార్వతి దేవి బాల త్రిపుర సుందరిగా పూజింప బడుతుంది విజయవాడ -విశాఖ పట్నం రైలు మార్గం లో సామర్లకోట ఒక రైల్వే కూడలి (Junction). విజయవాడ కూ 200 కిలోమీటర్ల దూరంలో NH 16గా  మారిన  NH 5 పై  ఉన్నది .  

యాగంటి ఉమా మహేశ్వర దేవాలయం


కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం యాగంటి అనే చిన్న గ్రామంలో ఉమా మహేశ్వర దేవాలయం ఉన్నది ఈ ఆలయాన్ని వేంకటేశ్వరుని ప్రతిష్టించే ఉద్దేశ్యం నిర్మించారు కాని వేంకటేశ్వరుని విగ్రహంలో చిన్న లోపం ఉండటం చేత  దాని ప్రక్కనే ఉన్న గుహలో ప్రతిష్టింఛి ఇక్కడ ఉమా మహేశ్వర లింగాన్ని ప్రతిష్టించారు . ఆలయం ఉన్న నంది  పరిమాణం పరంగా పెరుగుతూ యాగంటి బసవన్నగా  ప్రసిద్ది కెక్కింది పోతులూరి వీర బ్రహ్మం కాల జ్ఞానం లో ఈ నంది ప్రస్తావన ఉన్నది.  ఆలయ ప్రాగణం లో పుష్కరిణి లో నీరు అన్ని కాలాల్లోను ఒకేమట్టం లో ఉంటుంది  అగస్త్య మహాముని స్నానమాచారించటం  దీన్ని అగస్త్య పుష్కరిణి అని పిలుస్తారు . రోకళ్ళ గుహ ,శంకర గుహ ,ఎర్ర జాల గుహ యాత్రీకులను  ఆకర్షింస్తుంటాయి. ఇక్కడ కాకి కనిపించదు . దీనికి కారణం అగస్త్య మహాముని శాప కారణమని ఇక్కడివారు చెబుతారు .



యాగంటికి చేరుకునే మార్గాలు:-
దిగువ పేర్కొన్న 4 పట్నాలకు తెలంగాణా , ఆంధ్ర ప్రాంతాలనుండి రైలు ప్రయాణ సౌకర్య ముంది . 

1 . కర్నూలు :- నగరం నుండి via  బేతంచెర్ల రోడ్డు మార్గం ద్వారా 74 కిలోమీటర్లు దూరం. 
2 . నంద్యాల :-  నుండి  via బనగానపల్లి  రోడ్డు మార్గం ద్వారా 50 కిలోమీటర్లు దూరం.
3. Dhone (ద్రోణాచలం ) :- నుండి వయ బేతంచెర్ల రోడ్డు మార్గం ద్వారా 42 కిలోమీటర్లు దూరం. 
4 . తాడిపత్రి :- నుండి వయ బేలుం గుహలు రోడ్డు మార్గం ద్వారా 80 కిలోమీటర్లు దూరం ఇక్కడి నుండి Bus /Taxi /Auto లలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  







యాగంటి పరిసరాల్లో చూడతగిన  ప్రదేశాలు:-
బనగానపల్లి :- ఇది పోతులూరి వీర బ్రహ్మం గారి కాలజ్ఞానం భూస్తాపితం అయున గ్రామం   12 కిలోమీటర్లు దూరం.                 బేలుం గుహలు :- దేశంలో పెద్ద గుహలలో ఇవి ఒకటి.  తాడిపత్రి  కి వెళ్ళే మార్గం లో  45 కిలోమీటర్లు దూరం లో ఉన్నాయి . 
మహానంది :- ప్రసిద్ద శైవ క్షేత్రం 65కిలోమీటర్లు దూరంలో ఉన్నది (నంద్యాలకు 18 కిలో మీటర్ల దూరం లో ).


9, ఫిబ్రవరి 2016, మంగళవారం

శిల్పి పేరుతో ప్రసిద్ది చెందిన రామప్ప గుడి


                               తెలంగాణారాష్ట్రం వరంగల్ జిల్లాలో జిల్లాకేంద్రం  వరంగల్ గరానికి 
75kmదూరంలో పాలంపేట గ్రామ పరిదిలో అత్యంత అద్భుత శిల్ప నైపుణ్యంతో 12 శతాబ్దంలో కాకతీయ సేనాని రేచెర్ల రుద్రయ్య చేత నిర్మించబడినది . ఇది హైదరాబాద్  గరానికి 200కిలో మీటర్ల దూరంలో ఉన్నది . ఆలయం కాకతీయులు ప్రత్యెక శైలిలో (sand box technology ) నిర్మించారు ఇది  ఎత్తైనపీఠం పై నక్షత్ర ఆకారాన్ని పోలి ఉంటుంది.
                 

 ఇది శైవ దేవాలయం. ఇక్కడశివుడిని, శిల్పిరామప్ప పేరుతో కలిపీ రామేశ్వరుడుగా

వ్యవహరిస్తారు. దగ్గరలోనే తటాకం ఉన్నది.ఆ చెరువు,ఈ దేవాలయం రెండూ శిల్పిరామప్ప పేరుతోనే పిలువబడటం ఆ శిల్పినైపుణ్యానికి దక్కిన గౌరవంగా భావించవచ్చు. 

నిర్మాణంలోఅత్యంత  తేలికైన ఇటుకలని కూడావాడటం జరిగినది ఇవి నీటిమీద తేలే స్వభావం కలిగినవి. ఆలయప్రాంగణంలో ప్రధానఆలయంతోపాటు ఉపాలయాలున్నాయి. ఇవి అన్ని విదేశియులను  కూడా అబ్బురపరిచేశిల్పకళా  సౌందర్యాన్ని ప్రదర్శించేవె. 

ఆలయప్రాంగణంలో నందిముందు మనం  ఏప్రక్కన నిలబడినా నిక్కపొడుచుకున్న పలుచని చెవులతో మనవైపు  చూస్తున్నట్లే ఉంటుంది. 


                                 ఈ  దేవాలయం మహ్మదీయ సుల్తానుల దాడులకు ఇంకా మరెన్నో ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుంటూ శిధిలవస్తకు చేరుకున్నది. నవీన మానవుడి  జీవితంలో వేగం పెరిగినట్లే ప్రస్తుతం దేవాలయం క్షీణత లో కూడా  వేగం పెరిగింది.

రామప్ప గుడికి రావటానికి మార్గాలు :- ప్రత్యక్షం గా పాలంపేట కు railway connectivity లేదు కానీ పేరొందిన tourist place కావటం చేత  హైదరాబాద్ నుండి, వరంగల్ నుండి రోడ్డు రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. 75 కిలోమీటర్ల పరిధిలో వరంగల్ ,కాజిపేట రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. స్టేషన్ నుండి పెద్దపల్లి వెళ్ళే రైలు మార్గంలో మరో రైల్వే స్టేషన్ జమ్మికుంట (JMKT ) 65 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

రామప్ప గుడికి దగ్గరలో దర్శనీయ ప్రదేశాలు :- రామప్పగుడికి ఒక వైపున 30కిలోమీటర్ల దూరంలో లక్నవరం చెరువు (Laknavaram Lake ) చూడతగిన ప్రదేశం. మరొక వైపున 16కిలోమీటర్ల దూరంలో రేగొండ మండలం రావులపల్లె గ్రామం వద్ద చూడదగిన ప్రాంతం పాండవులు వనవాసం చేశారని చెబుతున్న పాండవుల గుహలు ఉన్నాయి.