4, ఏప్రిల్ 2016, సోమవారం

శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవ స్థానం ,తాడిపత్రి

అందమైన శిల్ప కళా నిలయం

                                                  జిల్లా కేంద్రం అనంతపురం కు 57 కిలోమీటర్ల దూరంలో కర్నూలు ,కడప జిల్లాల సరిహద్దులకు దగ్గరగా ఉన్నది తాడిపత్రి. మేము 26-03-2016 తేదిన తాడిపర్తి వెళ్ళడం జరిగింది . తిరుపతి నుండి షుమారు 250 కిలోమీటర్లు కడప మీదుగా 5 గంటలు బస్సు ప్రయాణం చేసి రాత్రి 8 గంటలకు తాడిపర్తి చేరుకున్నాము . ఆ రాత్రి అక్కడే గెస్ట్ హౌస్ లో ఉండి ఉదయాన్నే చింతల వెంకటేశ్వ ర ఆలయాన్ని , ఆ పిదప బుగ్గ రామలింగేశ్వర ఆలయానికి వెళ్ళేము.
                                                          
బుగ్గ రామలింగేశ్వర ఆలయ ప్రధాన ద్వారం 
                                 
                                               ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతా యుగం లో శ్రీ రామ చంద్రుడి చేత ప్రతిష్టిం బడిన లింగం కావటం చేత  రామలింగేశ్వరుడు గా పూజింప బడుచున్నాడు . క్రీ .శ 1495 ప్రాంతంలో  గుత్తి -గండికోట  పాలకుడుగా ఉన్న విజయనగర సేనాని రేచెర్ల రామలింగ నాయుడు (కొన్ని సంఘటనల అనతరం )    నీటి బుగ్గలున్న ప్రాంతం లో ఉన్న శివలింగాన్ని గుర్తించి ఆలయాన్ని నిర్మించాడు    నీటి బుగ్గ ఉన్న ప్రాంతం లో ఉండటం చేతశివుణ్ణి బుగ్గ రామలింగేశ్వరుడు  పిలువటం వాడుక అయినది .ఈ ఆలయం కూడా ముస్లిం పాలక సైన్యాల దోపిడీకి గురియై ప్రభావాన్ని కోల్పోగా 1800 సం. రం లో ఈ ప్రాంత కలెక్టర్ థామస్ మన్రో  ప్రోత్సాహంతో ఆలయ పునఃరుద్దరణ ,పూజాదికాలు ప్రారంభం అయినట్లు తెలుస్తుంది.  
ఉత్తర  (వెనుక ) ద్వారం 

                                               ఇది పెన్నా నది పడమటి తీరం లో ఉన్నది . ఆలయానికి శిధిలమైన  మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి . శిధిల బాగాలు ఆలయ ప్రాకారానికి వెలుపల బాగం లో చెల్లా చెదురుగా పడి ఉన్నాయి .ప్రధాన ద్వారం నుండి లోపలి వెళ్ళేప్పుడు లోపలి కుడి ప్రక్కన గోపురం లో బాగం గానే వినాయకుడికి చిన్నపాటి  మందిరం ఉంటుంది .     ఇక్కడ ఆలయ ప్రాంగణం లో శివాలయం తో పాటు  మరో రెండు దేవాలయాలు  కోదండ రామ స్వామి ఆలయం ప్రధాన గోపురానికి ఎదురుగా దక్షిణ ముఖ ద్వారం తో ఉంటె , రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం పడమటి దిశ ముఖద్వారం కలిగిఉన్నది . వీరబద్ర స్వామికి మరో చిన్న ఆలయం కూడా ఉంది  .                                 

గోపురం పై ఉన్న అందమైన శిల్పం 
                         తెలంగాణ లో ఇదే "  బుగ్గ రామలింగేశ్వర స్వామి " పేరుతొ వికారాబాద్  దగ్గరలో  వేరొక ఆలయం ఉన్నది . 

ప్రధాన గోపుర ద్వారం పై  అందమైన నటరాజస్వామి 
                                       ఆ రోజు ఆదివారము , అడపా దడపా భక్తులు వచ్చి వెళుతున్నారు . మాకు దర్శనం 15 నిముషాల్లోనే అయిపొయింది . శివలింగానికి యోని పిటం లేదు . ఆలయ ప్రాంగణం లో వెనుక  గోపురానికి ఎదురుగా ఉన్న  మండపం లో శివలింగం ఉన్నది . కొంతమంది భక్తులు శివునికి నీళ్ళ తో అభిషేకం చేస్తున్నారు . 
రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం 
                                   ఇక్కడ కు రావటానికి ముందు చింతల వెంకట రమణుడి ఆలయానికి వెళ్ళేము . ఇది కూడా బుగ్గ రామలింగెశ్వర ఆలయం తో పాటు నిర్మిత మైనది.  ఇక్కడి శ్రీనివాసుడికి  చింతల వెంకట రమణుడు అనే పేరు  ఎలా వచ్చింది  అని అక్కడి వారిని అడిగితే " చింతలు తీర్చే దైవమని ,పూర్వం చింత చెట్ల వనాలు ఉండేవని ," అనే భిన్న కారణాలు వారు చెప్పారు .
వెంకట రమణుడి ఆలయం 

                       ఈ ఆలయం తూర్పు దిశగా ఉన్నది . వెంకట రమణుడి ప్రధాన ఆలయానికి ప్రక్కనే లక్ష్మి దేవి "ఆనందవల్లి అమ్మవారు" గా చిన్న ఆలయం లో కొలువై ఉన్నది .  


వెంకట రమణుడి ఆలయం 
తాడిపత్రి కి చేరటానికి మార్గాలు:- చెన్నై-రేణిగుంట -గుత్తి (Gooty ) రైలు మార్గం లో తాడిపత్రి రైల్వే స్టేషన్ ఉన్నది దేశం లో  చాలా ప్రాంతాల నుండి ఇక్కడకు రైలు ప్రయాణ సౌకర్యమున్నది. దగ్గరలో ఉన్న అనంతపురం, కడప ల నుండి రాష్ట్ర ప్రభుత్వ  bus ల ద్వారా లేదా taxi ల ద్వారా ఇక్కడకు చేరుకోవచ్చు . తాడి పత్రీ  చిన్నస్థాయి  పట్నం  ఇక్కడ పరిమితి సౌకర్యాలతో వసతి గల గెస్ట్ హౌస్ ఉన్నాయి . దగ్గరలో ఉన్న రేణిగుంట విమానా శ్రయం 240 కిలోమీటర్లలో ఉన్నది.
తాడిపత్రికి దగ్గరలో ఉన్న సందర్శనీయ ప్రదేశాలు :-
యాగంటి:-ఇది కూడా ప్రముఖ శైవక్షేత్రం 73 కిలోమీటర్ల దూరంలో ఉన్నది
బేలుం గుహలు:- దేశం లోనే పెద్ద గుహలలో 2వ స్థానం లోఉన్నాయి . యాగంటికి వెళ్ళే మార్గంలో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి . 

ఆలూరు కోన :-శ్రీ రంగనాథ స్వామి ఆలయం పెన్నా నదికి ఆవలి వైపున  8 కిలోమీటర్ల దూరంలో ఉన్నది .  

కామెంట్‌లు లేవు: